No Tension


హడావుడి వద్దే వద్దు!!
క్రమశిక్షణతోనే ఒత్తిడికి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేటి స్పీడ్ యుగంలో వ్యక్తులపై ఒత్తిడి ఎంతో ప్రభావం చూపుతోంది. దీని కారణంగా మానసికంగానూ, శారీరకంగానూ దీర్ఘకాలంలో మనిషి ఎన్నో సమస్యల బారిన పడతాడు. అయితే, ఈ ఒత్తిడిని జయించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు.
సమయం ఎంతో విలువైనది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిపెడితే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. కొన్ని లక్ష్యాలను పెట్టుకుని, వాటి దిశగా కృషి చేయాలి. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఎప్పుడు ఏ పని చేయాలన్నదానిపై కచ్చితమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అన్న దానిపై స్పష్టత ఉంటే టైం వేస్ట్ కాదు.
దైనందిన వ్యవహారాలపై అదుపు అవసరం. మంచి అలవాట్లు ఎప్పుడూ మనిషికి తగిన మనోధైర్యాన్నిస్తాయి. హడావుడిగా తినడం, పొగతాగడం వంటి అలవాట్లు కట్టిపెట్టాలి. దినచర్యలో చేసుకునే చిన్నచిన్న మార్పులే వ్యసనాలను వదలించుకోవడంలో ఎంతో సాయం చేస్తాయి.
బిజీ షెడ్యూల్‌లో కొంత విరామం తీసుకోవడం మంచిది. శరీరానికి, మనసుకు ఆ విశ్రాంతి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా శక్తి పుంజుకోవచ్చు. రోజూ హాస్యభరితమైన విషయాలను చదవడం అలవాటుగా మార్చుకోవాలి.
ఒత్తిడి కలిగించే అంశాలకు దూరంగా ఉండాలి. ట్రాఫిక్ గందరగోళం, రద్దీగా ఉండే సూపర్ మార్కెట్లు కొందరిపై ఒత్తిడి కలిగిస్తాయి. అలాంటి పరిస్థితులకు అనుగుణంగా మెలగడం ఎలాగో నేర్చుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు.