Girl Friend



'ఇండియా ఇండియా ఇండియా' ఏముంది? ఇండియాలో? అంత పద్ధతీ, సంస్కృతీ కావాలనుకుంటే అక్కడే ఉండలేక పోయారా ? అపుడేమో మీ అవుసరానికి, సంపాదన కోసం డాలర్ల మోజులో ఇక్కడి కొచ్చారు. మాకు గట్టిగా నాలుగేళ్ళు కూడాలేవు. మాటలే సరిగా రాని వయస్సు. ఎల్.కెజి.నుంచి ఇక్కడే చదివాం. ఇక్కడి పద్ధతిలోనే పెరిగాం. ఇప్పుడు అమాంతంగా అక్కడి పద్ధతులు సంస్కారాల గురించి చెప్తె మాకేం తెలుస్తుంది? అలవాటైతె వండిపెట్టాల్సి వస్తుందని తిండి దగ్గర్నుంచి ఇక్కడివే పీజాలు, బ్రెడ్డులు, డోనట్లు, పెట్టి మన తిండికూడా మర్చిపోయేలా చేశారు. మీ సుఖాల కోసం నచ్చినా నచ్చక పోయినా `ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలని మా మానాన మమ్మల్ని వదిలేసారు. అలాగే మా పాలు మేమే వేడి చేసుకుని, మాతిండి మేమే తిన్నాం. అలాంటిది ఇప్పుడు అమాంతంగా మనదేశం, మన సాంప్రదాయం అంటూ ప్రాణాలు తీస్తే మాకేం తెలుస్తుంది?' అంటూ నిర్విరామంగా వచ్చీరాని తెలుగులో తల్లిని సాధిస్తూనే ఉంది లావణ్య.

లావణ్య అంటే నిజంగానే లావణ్యం ఉట్టిపడేలా ఉంటుంది. తెల్లగా, ముద్దుగా, బొద్దుగా, అందంగా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం. ఏ డ్రస్సు వేసుకున్నా చక్కగా నప్పుతుంది. ఇక్కడి అమెరికన్ అమ్మాయిలకి తీసి పోనట్టుగా ఉంటుంది. నిజానికి తనకి చిన్నప్పటి నుంచీ పట్టు పరికిణీలన్నా, పెద్ద పెద్ద జడలన్నా, అందంగా అలంకరించుకోవాలన్నా, బోలెడు నగలు పెట్టుకోవాలన్నా చాలా ఇష్టంగా ఉండేది. కానీ ఇక్కడ కొచ్చాక అవన్నీ బలవంతాన వదిలేసి ఈ కత్తిరింపు జుట్లు, ఈ పాంటు, షర్ట్ లు, చలికి కోట్లు అన్నిటికీ అలవాటు పడి పోయింది. అంతేకాదు... అమ్మ మాత్రం? అమెరికా గొప్ప కోసం బొట్టు పెట్టుకోదు, గాజులు సరేసరి, మట్టెలూ, మంగళసూత్రాలు ఎప్పుడు పరుపు కిందే. చీరలు, నగలు నామోషీ. ఇంక తనకి మాత్రం ఎందుకివన్నీ చెప్పడం? తను మాత్రం అన్నీ చేయవచ్చు. నేనేం చేసినా ప్రతీదీ వద్దు వద్దు. ఇది మన పద్ధతి కాదు. స్లీపోవరు వద్దు, ఫ్రెండుతో సినిమాలు కుదరదు, వాటరు పార్కులు, పిక్ నిక్ లు అసలే కుదరవు. ఇలా అన్నిటికీ అడ్డాలే. ఏది ఏమైనా తన నిర్ణయం మార్చుకోదు. అందుకే ముందుగా డాడీకే చెప్పాలి. అసలిక్కడ ఒకరినొకరు పట్టించుకోరు. అవుసరమైతే తప్ప పలకరించుకోరు. ఎవరి గోల వారిదే.

మన ఇండియాలో లాగ జీవితాంతం పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఉండరు. అసలు భార్యా భర్తలే ఎన్నాళ్ళు కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారో తెలియదు. తన ఫ్రెండ్స్ చాలా మంది `స్టెప్ ఫాదరుతో బాధ పడుతున్నామని, స్టెప్ మదర్ సరిగా చూడటంలేదని, హాఫ్ బ్రదర్, హాఫ్ సిస్టర్ తో కొట్లాటలని చెప్పి బాధపడుతూ ఉంటారు. కొన్ని అర్ధమైనా, కొన్ని అర్ధం కాక విని ఊరుకుంటుంది. ఒకోసారి ఎందుకొచ్చిన అమెరికా? అనిపిస్తుంది. ఏం చేస్తాం? అలవాటు పడ్డాక తప్పదు కదా? అందుకే అమ్మతో వాదనకి దిగింది. ఇక లాభం లేదనుకొని డాడీతో మాట్లాడటానికే నిర్ణయించుకుంది.