silence



కొండ మీద నిల్చొని ఉన్నాడు రాంబాబు.పల్లె చాలా అందంగా కనబడుతోంది.అయితే పల్లెకు చెరో రెండు వైపులా అదేదో స్తంభంలా రెండు కట్టడాలు కనిపించాయి.అవి ఏమిటో ఎంత ఆలోచించినా అంతుచిక్కలేదు.ఇంతలో తన పాతికేళ్ల కొడుకు సూటూ బూటూ వేసుకొని దర్జాగా తన దగ్గరకి వచ్చాడు .” అరే గోపీ! ఆ స్తంభాలేవిట్రా అలా ఉన్నయ్? అసలెందుకవి? ” అడిగాడు కొడుకుని.

 “ఓ.. అదా! సెల్ టవర్లు నాన్నా.మీ కాలంలో అయితే మాలాగా ఫోన్లు లేవుగా….!బావిలో కప్పలాగ నిశ్శబ్దంగా వుండేవారు. కానీ ఇప్పుడు కాలం మాది.చూశావా? ఆ ఒక్క టవర్ చాలు.అమెరికాలో ఉన్నవాడినీ అమలాపురంలో ఉన్నవాడినీ కలపడానికి.అదంతా మా సైన్సు సాధించిన గొప్పే నాన్నా” అన్నాడు గోపి. కొడుకు మాటలు ఎబ్బెట్టుగా ఉన్నా ” నిజమేరోయ్” అని వూరకుండిపోయాడు రాంబాబు.

ఏళ్ళు గడిచాయి.సరిగ్గా పది సంవత్సరాలకి అదే కొండపైన గోపి ఉన్నాడు.
ఇప్పుడు పల్లె ముందున్నంత అందంగా లేదు.టవర్లు మాత్రం పెరిగాయి.దాంతో పాటు చెవుడు,చర్మ వ్యాధులూ కూడా ప్రతి ఒక్కరికీ ఉచితంగా అలవాటైంది.గోపీకి కూడా.ఇప్పుడు పల్లె నిశ్శబ్దంగా వుంది.టవర్ల మధ్యలో రాంబాబు సమాధి స్పష్టంగా కనిపిస్తోంది.ఇప్పుడు గోపికి పది సంవత్సరాలక్రితం మాటలు గుర్తొచ్చాయి.విని నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు.అయితే ఆ నవ్వులో జీవంలేదు.